26 ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల తనిఖీ కొసం 4 బృందాలు ఏర్పాటు
ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులపై సమీక్షించిన అదనపు కలెక్టర్.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
సెప్టెంబర్ 26 లోగా ఖమ్మం జిల్లాలో ఉన్న 26 ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులను తనిఖీ చేసి రిపోర్ట్ సమర్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 26 ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులను తనిఖీ చేసేందుకు డిసిపిఓ, డివైఎస్ఓ, డి.డబ్ల్యూ.ఓ, ఏడి అగ్రికల్చర్ ఆధ్వర్యంలో 4 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి బృందంలో వైద్య శాఖకు సంబంధించిన ప్రోగ్రాం అధికారులు, సినియర్ అసిస్టెంట్, ఇతర వైద్య సిబ్బంది ఉంటారని అన్నారు. ప్రతి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి భవన ప్లాన్, ఆక్యూపెన్సి సర్టిఫికేట్, ట్రేడ్ లైసెన్స్, ఫైర్ శాఖ ఎన్.ఓ.సి., బ్లడ్ బ్యాంక్ లైసెన్సు, ఆసుపత్రి భవనం ఎత్తు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సర్టిఫికెట్, బయో మెడికల్ వేస్టేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఎపిఎంసిఈ, ఫార్మసీ లైసెన్సు, అంబులెన్స్ ఫిట్నెస్ రిజిస్ట్రేషన్, పిసిపిఎన్.డి.టి యాక్ట్ రిజిస్ట్రేషన్ వంటి అన్ని పత్రాలు పరిశీలించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న ఇన్ ఫ్రా, ఎక్విప్మెంట్, స్టాఫ్ వివరాలు, రాత్రిపూట వైద్యులు అందుబాటులో ఉంటున్నారా, డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది వంటి అన్ని అంశాలను పరిశీలించాలని అన్నారు. ఆసుపత్రి స్పెషాలిటీ కోడ్ ప్రకారం ఎక్విప్మెంట్ ఉందో లేదో చెక్ చేయాలని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులను పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అవసరమైన అన్ని రకాల డాక్యుమెంట్ లను ముందే తయారు చేసుకుని తీసుకొని రావాలని అన్నారు. ఆసుపతులను తనిఖీ చేసి సమగ్ర వివరాలు పరిశీలించాలని అన్నారు. ప్రతి ఆసుపత్రికి సంబంధించి తనిఖీ సమయంలో గుర్తించిన మేజర్, మైనర్ పొరపాట్లు సంబంధించి సంపూర్ణ వివరాలు రిపోర్ట్ లో ఉండేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ బి. కళావతి బాయి, డి.వై.ఎస్.ఓ. సునీల్ రెడ్డి, డి.డబ్ల్యూ.ఓ. కె. రాంగోపాల్ రెడ్డి, సిడిపిఓ విష్ణువందన, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.









