శ్మశానానికి రహదారి లేక నరకం చూస్తున్న పేద ప్రజలు
అధికారం అండతో పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్న కబ్జాదారులు
కబ్జాదారుల కొమ్ము కాస్తున్న పాలకులు
పేద ప్రజలు ఇబ్బందులను పట్టించుకోని అధికారులు
సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు.
నేటి గదర్ న్యూస్, వైరా:-
వైరా మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ బజార్ శ్మశాన వాటికకు రహదారి లేక పేద ప్రజలు నరకం అనుభవిస్తున్నారని, పేద కుటుంబంలో మరణం సంభవిస్తే బంధువులు చందాలు వేసుకొని దహన సంస్కారాలు చేయాల్సిన దుస్థితిలో హనుమాన్ బజార్ పేద ప్రజలు బ్రతుకుతున్నారని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. శనివారం సిపిఐ(ఎం) వైరా శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ బజార్ స్మశాన వాటికకు బౌండరీలు ఏర్పాటు చేసి శాశ్వతంగా రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు వైరా మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం మున్సిపాలిటీ కమిషనర్ గురులింగంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ హనుమాన్ బజార్ స్మశాన వాటికకు రహదారి లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎవరికైనా మరణిస్తే స్మశాన వాటికకు వెళ్ళటానికి రహదారి లేక ముండ్ల కంప చెట్లను తొలగించడానికి జేఏసీ వాడాల్సి వస్తుందని, పేద కుటుంబంలో మరణం సంభవిస్తే చందాలు వేసుకొని దహన సంస్కారాలు చేయాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట మరణం సంభవిస్తే దహనం చేయడానికి మోకాళ్ళ లోతు బురద, ముళ్ళ కంపతో కుటుంబ సభ్యులు నరకం చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల కష్టాలు పాలకులకు పెట్టడం లేదని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారుతూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కబ్జాదారులు పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పాలకులు, అధికారులు కబ్జాదారుల కొమ్ముకాస్తున్నారని, రెవిన్యూ అధికారులు గతంలోనే సర్వే చేసి బౌండరీలు ఏర్పాటు చేసినా మున్సిపాలిటీ అదికారులు శాశ్వతంగా హద్దులు నిర్ణయించి రహదారి ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే మున్సిపాలిటీ అధికారులు స్పందించి
స్మశాన వాటికకు హద్దులు నిర్ణయించి శాశ్వత రహదారి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హనుమాన్ బజార్ స్మశాన వాటిక సమస్య పరిష్కారం అయ్యేంతవరకు సిపిఎం పోరాడుతుందని తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ కమీషనర్ గురులింగం స్పందిస్తూ శ్మశాన వాటికను సందర్శించి సమస్యను పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, నాయకులు గుడిమెట్ల రజిత, పైడిపల్లి సాంబశివరావు, గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, బాజోజు రమణ, వైరా శాఖ కార్యదర్శి ఓర్సు సీతారాములు, మాడపాటి వెంకటేశ్వరరావు, అమరనేని కృష్ణ, నుకల వేంకటేశ్వరరావు, వల్లేపు కొండలు, దేవళ్ళ క్రిష్ణ, వల్లేపు రాము, దుగ్గిరాల సామేలు, దుగ్గిరాల జాకోబ్, దుగ్గిరాల బాలస్వామి, బత్తుల ప్రమీల, భూక్యా విజయ, మాడపాటి సుజాత, దేవళ్ళ మంగ, మాడపాటి రామారావు, దండిగిరి వెంకటేష్, వేముల గోపి, ఉప్పు రాజేశ్వరి, వేముల భూలక్మీ, సైదమ్మ, భైరవ వెంకటేశ్వర్లు, కిన్నెర మోతి తదితరులు పాల్గొన్నారు.









