అశ్వారావుపేటకు వేల సంఖ్యలో కదలివచ్చిన గిరిజనులు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 21: ఎస్టీ జాబితాలో అక్రమంగా చేర్చిన లంబాడీలు, సుగాలీలు, బంజారాలను తక్షణమే ఎస్టీ జాబిత నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో వేలాది మంది గిరిజనులు ‘గిరిజన ఆక్రోశ మహా ప్రదర్శన’ నిర్వహించారు. ఆదివాసీ తొమ్మిది గిరిజన సంఘాలు పిలుపు మేరకు సుమారు తొమ్మిది ఆదివాసీ తెగలకు చెందిన గిరిజనులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి, కొమ్ము నృత్యాలు చేస్తూ, విల్లంబులు చేతబూని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీల ఆరోపణ ఈ సందర్భంగా జరిగిన పోరుగర్జన మహాసభలో ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ, “మా న్యాయ పోరాటాన్ని అడ్డుకోవడానికి లంబాడీలు ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎంపీలు తెల్లం వెంకట్రావు, సోయం బాబురావు సుప్రీం కోర్టులో కేసు వెయ్యడం వల్ల కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. లంబాడీలు కోర్టులో ఆధారాలు చూపి తమ హోదాను నిరూపించుకోవాల్సింది పోయి, ధర్నాలు, ర్యాలీలు చేస్తూ మా నాయకులను, ఆదివాసులను తిడుతున్నారు. ఇది వారి అసహనానికి, చేతగాని తనానికి నిదర్శనం. చట్టబద్ధత లేని వారి హోదాను కాపాడుకోవడానికి మా ఉనికినే ప్రశ్నిస్తున్నారు. వారి బెదిరింపులకు, తిట్లకు భయపడే ప్రసక్తే లేదు. మా హక్కుల కోసం మేము పోరాటం కొనసాగిస్తాం. మా పోరాటం ఏ ఒక్కరికో వ్యతిరేకం కాదు, మా హక్కుల కోసం అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా లంబాడీ, సుగాలీ, బంజారా తెగలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయని ఏ రాజకీయ నాయకుడిని తమ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వమని వారు శపథం చేశారు. ఈ నిరసనలో గోండు, కోయ, నాయకపోడు, పర్ధాన్, కొలాం, ఆంథ్, తోటి, కొండరెడ్డి, చెంచు మొదలైన తొమ్మిది గిరిజన తెగల ప్రజలు పాల్గొని తమ ఐక్యతను చాటారు. తమ హక్కుల సాధన కోసం ఐక్య పోరాటం కొనసాగిస్తామని వారు నినదించారు.









