ఆందోళనకు మద్దతు పలికిన ఆదివాసీ సంఘం; డిమాండ్ నెరవేరకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, రామన్నగూడెం గ్రామస్తులు తమ భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత మూడు రోజులుగా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన దీక్షలు చేస్తున్నారు. సర్వే నెంబర్లు 30, 36, 39లలో జాయింట్ సర్వే చేసి భూములను అప్పగించాలని 300 మందికి పైగా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ పూర్తి మద్దతు ప్రకటించింది. బుధవారం ఆదివాసీ సంఘం రాష్ట్ర కోశాధికారి కొర్సా వెంకటేష్ దొర నిరసనకారులకు సంఘీభావం తెలిపారు. ఆదివాసీల భూములను తక్షణమే అప్పగించాలని ఆయన జిల్లా కలెక్టర్‌ను కోరారు. లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జాతీయ నాయకులు తెల్లం రామారావు దొర, రాష్ట్ర నాయకులు గడ్డం వెంకటేష్, మండల నాయకులు కొర్సా వీర్రాజు, కారం అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.









