అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం: అశ్వరావుపేట ఆదివాసీ రైతుల దీక్షకు జీఎస్ఎస్ యువజన నాయకుడు అరేం ప్రశాంత్ సంఘీభావం
‘మా భూములు మాకివ్వండి’: కలెక్టరేట్ ఎదుట మూడో రోజుకు చేరిన రామన్నగూడెం రైతుల ఆత్మగౌరవ నిరాహార దీక్ష
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామ ఆదివాసీ రైతులు తమ భూముల సమస్యపై చేస్తున్న ఆత్మగౌరవ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న ఈ దీక్షకు GSS జీఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్ సంఘీభావం తెలిపారు.
ముఖ్య డిమాండ్లు:
సర్వే నెం. 30, 36, 39లోని ఆదివాసీ పట్టా భూములను అటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్త సర్వే నిర్వహించి వెంటనే రైతులకు అప్పగించాలి.
గతంలో నిర్వహించిన జాయింట్ సర్వే రిపోర్టు వివరాలను రెవెన్యూ అధికారులు వెల్లడించాలి.
ఆదివాసీ రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి.
కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను అమలు చేయాలి.
అంకమ్మ వెంకమ్మ చెరువు వరద కాలవ కారణంగా నష్టపోయిన రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం మంజూరు చేయాలి.
రామన్నగూడెం గ్రామంలో అర్హత ఉన్న ఆదివాసీ రైతులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.
ఈ సందర్భంగా అరేం ప్రశాంత్ మాట్లాడుతూ, ఉన్నతాధికారుల హామీని కూడా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ రాష్ట్ర నాయకులు సోయం సత్యనారాయణ, తోగూడెం మాజీ ఎంపీపీ మడవి సరస్వతి, ఆదివాసీ నాయకులు సోయం లక్ష్మయ్య, పునేం నాగేశ్వరావు, రామన్నగూడెం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.









