నేటి గద్దర్ న్యూస్,అశ్వారావుపేట, సెప్టెంబర్, 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, ఊట్లపల్లి గ్రామంలోని ముత్యాలమ్మ తల్లి ఆలయ సన్నిధిలో దుర్గాదేవి సంబరాలను పురస్కరించుకుని భవానీలు ఘనంగా కథాగాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగుల్లంకకు చెందిన బోనం గురిజి సాక్షాత్తు ఆదిపరాశక్తి చరిత్రను కళ్లకు కనుపండుగలాగా ప్రదర్శించారు. ఈ కథాగానంలో అమ్మవారి కథ, వెంకటేశ్వర స్వామి కథ వంటి పౌరాణిక ఘట్టాలను అనేక వేషధారణలతో, చిన్న, పెద్ద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు. కాలం ఎంత మారినా, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో నారద మహర్షి, విష్ణుమూర్తి, పార్వతీ దేవి వంటి పాత్రలను పోషించిన కళాకారుల అద్భుత నటన ఊరి పెద్దలను, భవానీలను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా, ఊరిలోని చిన్నపిల్లలకు కూడా వేషధారణ వేసి, వారిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం ద్వారా పిల్లలు ఎంతో సంతోషించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, ఇలాంటి కథలు తెలుసుకోవడం వలన సాంప్రదాయాలు తరతరాలకు గుర్తుండిపోతాయని, భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు.









