‘చీకటి పాలన’పై బీజేపీ ఆగ్రహం: దమ్మపేటలో విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన
విద్యుత్ కోతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు, చిరు వ్యాపారులు
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, సెప్టెంబర్, 26:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో నిరంతరాయ విద్యుత్ అంతరాయంపై ప్రజలు, వ్యాపారుల తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, దీనిపై స్థానిక భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు తీవ్రంగా స్పందించారు. మండలంలోని మందలపల్లి విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించి, అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చీకట్లో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని తీవ్రంగా విమర్శించారు. మండల వ్యాప్తంగా విద్యుత్ అంతరాయం తీవ్రంగా ఉండటంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. “పగలు-రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు కరెంటు పోతుందో-వస్తుందో అన్న కనీస సమాచారం కూడా ఇచ్చే పరిస్థితిలో దమ్మపేట మండల విద్యుత్ అధికారులు లేరు. అంతేకాకుండా, విద్యుత్తు మరమ్మత్తుల పేరుతో నెలల తరబడి కేవలం కాలయాపన చేస్తున్నారు” అని వారు ఆరోపించారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే మేలుకుని, కరెంటు అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ తరపున వారు డిమాండ్ చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ విశ్వేశ్వర రావు, నియోజవర్గ నాయకులు తంబల రవి, గుడ ముత్యాలరావు, నాగరాజు, చందు, నరేష్, రత్నకుమారి, సుజాత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.









