కాంగ్రెస్ దగ్గర డబ్బుంటే బిఆర్ఎస్ వెంట ప్రజలు ఉన్నారు -రేగ కాంతారావు
దమ్మపేట బిఆర్ఎస్ నాయకుల సమావేశంలో కాంగ్రెస్ పాలనపై రేగ, మెచ్చా విమర్శలు
మోసం చేయడమే కాంగ్రెస్ నైజం – మెచ్చా
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, అక్టోబర్, 03: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండల స్థాయి నాయకుల సమావేశం నేడు మండల పార్టీ అధ్యక్షులు దొడ్డా రమేష్ ఆధ్వర్యంలో పార్కలగండిలోని కొబ్బరి తోటలో ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు మరియు అశ్వారావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “కాంగ్రెస్ దగ్గర డబ్బుంటే, బిఆర్ఎస్ వెంట ప్రజలు ఉన్నారు” అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సొమ్మును ఇతర రాష్ట్రాలకు పంచుతోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం గెలుపు బిఆర్ఎస్ అభ్యర్థులదే అని ఆయన స్పష్టం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ, “మోసం చేయడమే కాంగ్రెస్ నైజాం” అని తీవ్రంగా విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడిచినా, 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీల సంగతి ఏంటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ నాయకులు ఏ మొహం పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా పట్వారీగూడెం పంచాయతీకి చెందిన బుల్లా నాగరాజు, వాడే వసంత్, కొమరం వెంకటేశ్వరరావు, కుర్సం మారప్ప, కాసిని బాలాజీ, బందెల నాగరాజుతో పాటు గణేష్ పాడు నుంచి ఎర్రగొర్ల సాయి, దురదపాడు నుంచి కుర్సం కవిత కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి రేగ కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరావు, వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జున రావు, నియోజకవర్గ నాయకులు సోయం విరభద్రం, మాజీ జడ్పీటీసీ సున్నం నాగమణి, పార్టీ మండల నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









