కష్టపడిన ప్రతి కార్యకర్తకు కచ్చితంగా గుర్తింపు ఉంటుంది; స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించడమే మన లక్ష్యం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్ 03: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని లక్ష్యంగా చేసుకోవాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా గుర్తింపు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అశ్వారావుపేట మండలం, వినాయకపురం చిలకలగండిలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి అనుసరించాల్సిన విధివిధానాల గురించి ఆయన పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి నుంచే పార్టీ బలాన్ని మరింతగా పెంపొందించుకోవాలని, కార్యకర్తలందరూ సమష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు.









