గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలి; ‘మనం చేసిన అభివృద్దే మనల్ని గెలిపిస్తుంది’ – మెచ్చా నాగేశ్వరరావు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 04: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగ కాంతారావు పిలుపునిచ్చారు. కెసిఆర్ పరిపాలనలో శోభిక్షంగా ఉన్న రాష్ట్రం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్వానంగా తయారైందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. గెలుపే ఏకైక లక్ష్యంగా ప్రతి ఒక్కరు కష్టపడాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అశ్వారావుపేట మండలంలోని ఆసుపాక గ్రామంలో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రేగ కాంతారావుతో పాటు అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ మనం చేసిన అభివృద్దే రాబోయే ఎన్నికల్లో మనల్ని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 నెలలు గడిచినా, అశ్వారావుపేట నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోయారని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. సమావేశం అనంతరం, ఇటీవల ఎంబిబిఎస్ సీటు సాధించిన పెంబుల ప్రసాద్ కుమారుడు సాయి వర్ధన్‌ను రేగ కాంతారావు మరియు మెచ్చా నాగేశ్వరరావు లు శాలువాలతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









