మహిళలు, పిల్లలకు ఆటల పోటీలు; విజేతలకు శనివారం దుర్గమ్మ ఊరేగింపు ముందు బహుమతులు ప్రదానం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 04: అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామంలో దేవి నవరాత్రులు, బతుకమ్మ పండుగ సందర్భంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. శుక్రవారం సాయంత్రం గ్రామ మహిళలు మరియు పిల్లల కోసం ప్రత్యేకంగా పలు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా కుర్చీల ఆట, తాడు లాగుడు వంటి సాంప్రదాయ ఆటలతో పాటు పలు సరదా పోటీలు నిర్వహించారు. ఆటల్లో గెలుపొందిన వారి పేర్లను కమిటీ సభ్యులు నమోదు చేసుకున్నారు. పోటీల అనంతరం, మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ, ఆ పాటలకు అనుగుణంగా ఉల్లాసంగా నృత్యాలు చేశారు. రంగుల బతుకమ్మలు, పూల పరిమళంతో గ్రామ వాతావరణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా బతుకమ్మ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, సంబరాల ముగింపులో భాగంగా శనివారం రోజున దుర్గమ్మ వారి ఊరేగింపు ఘనంగా ఉంటుందని తెలిపారు. శుక్రవారం నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు ఊరేగింపునకు ముందుగా బహుమతులు అందజేయడం జరుగుతుందని వారు ప్రకటించారు.









