పోరాటాల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి
సిపిఐ(ఎం) నాయకురాలు గుడిమెట్ల రజిత.
శ్మశాన వాటికను సందర్శించిన సిపిఐ(ఎం) బృందం.
నేటి గదర్, న్యూస్, వైరా:-
పోరాటాల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని, హనుమాన్ బజార్ బీసీలకు స్మశాన వాటిక రహదారి సమస్య ఎట్టకేలకు పరిష్కారం అయిందని సిపిఐ(ఎం) వైరా పట్టణ నాయకురాలు గుడిమెట్ల రజిత అన్నారు. శుక్రవారం సిపిఐ(ఎం) బృందం వైరా మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ బజార్ శ్మశాన వాటికను సందర్శించారు. ఈ సందర్భంగా గుడిమెట్ల రజిత మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా హనుమాన్ బజార్ స్మశాన వాటికకు రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పేద కుటుంబాలలో ఎవరైనా మరణిస్తే చందాలు వేసుకొని రహదారిని బాగు చేసుకుని దహన సంస్కారాలు చేస్తున్నారన్నారు. అనేక సంవత్సరాలుగా దశల వారి ఆందోళనలో భాగంగా హనుమాన్ బజార్ స్మశాన వాటికకు దారిని ప్రభుత్వాధికారులు వేయడం జరిగిందని తెలిపారు. భూములకు విలువ పెరుగుతున్నా కొద్దీ ప్రజల్లో స్వార్థం పెరుగుతుందని, గుండ్రాతి మడుగు రెవెన్యూ పరిధిలో వైరా చెరువు శిఖం భూములు ఆక్రమణకు గురికాకుండా అదికారులు కాపాడాలని అన్నారు. 2015 సంవత్సరం నుండి అనేక దఫాలుగా చెరువు చుట్టూ ఉన్న శిఖం భుములను ఆక్రమణకు గురికాకుండా చూడాలని సిపిఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయని గుర్తు చేశారు. ప్రభుత్వ భూములు ఆక్రమణ గురికావడం వల్ల ప్రజా అవసరాలకు ప్రభుత్వ భూములు లేకుండా పోయాయని అన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ల లతో ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలని, ఇప్పటికైనా హనుమాన్ బజారుకు స్మశాన వాటికకు పర్మినెంట్ సిసి రోడ్డు నిర్మాణం చేయాలని, స్మశాన వాటికకు హద్దులు ఏర్పాటు చేయాలని అన్నారు. అవి సాధించేంత వరకు సిపిఐ(ఎం) పోరాడుతూనే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) పార్టీ వైరా శాఖ కార్యదర్శి ఓర్సు సీతారాములు, సభ్యులు దేవళ్ళ కృష్ణ, బత్తుల ప్రమీల, వల్లేపు ఏడుకొండలు, దేవళ్ళ మంగ, ఉప్పు భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.









