సీసీ రోడ్ల నిర్మాణం పరిశీలన, సమస్యల పరిష్కారానికి హామీ
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 14: అశ్వారావుపేట మండల కేంద్రంలోని మోడల్ కాలనీలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు మంగళవారం పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను, స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా కమిషనర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్లను పరిశీలించారు. అనంతరం స్థానికులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య, వీధి దీపాల సమస్యలను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పరిసరాల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కాలనీవాసులకు సూచించారు. ప్రతిరోజు వచ్చే చెత్త బండిలో తడి చెత్త, పొడి చెత్తను తప్పనిసరిగా వేరువేరుగా ఇవ్వాలని కమిషనర్ కోరారు. అలాగే, కాలనీలోని ఖాళీ స్థలాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, అక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మోడల్ కాలనీలోని పల్లె దవాఖానాతో పాటు అంగన్వాడి స్కూల్ను కమిషనర్ సందర్శించారు. అంగన్వాడి ప్రాంగణంలో వాతావరణం ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, తరచూ ‘శుభ్రత-పరిశుభ్రత’పై కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీ విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్న కమిషనర్, పిల్లలకు అందించే పోషకాహారంలో భాగంగా మునగాకుతో పాటు ఆకుకూరలు కచ్చితంగా మెనూలో ఉండేలా చూడాలని ఆదేశించారు. గర్భిణీలకు, చిన్న పిల్లలకు ఆరోగ్య సలహాలు, మెరుగైన కార్యక్రమాలను అందించాలని సూచనలు చేశారు. చివరగా, మోడల్ కాలనీకి అన్ని మౌలిక సౌకర్యాలను కల్పిస్తామని కమిషనర్ నాగరాజు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మిండా హరిబాబు, తగరం ముత్తయ్య, నార్లపాటి కాంతారావు, నార్లపాటి దివాకర్ లతో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.









