నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 14: అశ్వారావుపేట మండలం, వినాయకపురం సెంటర్‌లో వ్యాపారం చేస్తున్న దుకాణదారులు తీవ్రమైన భద్రతా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా అద్దెలు చెల్లిస్తున్నప్పటికీ, తమ వ్యాపార సంస్థలకు రక్షణ కరువైందని, దీనివల్ల నష్టాలు వస్తున్నాయని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సెంటర్‌లో వీధి దీపాలు, సీసీ కెమెరాల లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ నెల 3వ తేదీ రాత్రి జరిగిన ఒక సంఘటన ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. సెంటర్‌లోని ఓ దుకాణాన్ని గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుకాణానికి తీవ్ర నష్టం వాటిల్లింది. బాధితులు తమ సొంత ఖర్చుతో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా రికార్డులను పరిశీలించగా, రాత్రి పూట సెంటర్‌లో సరైన వీధి దీపాల వెలుతురు లేకపోవడం వలన, వాహనం నంబరు ప్లేటును గానీ, డ్రైవర్‌ను గానీ స్పష్టంగా గుర్తించడం సాధ్యపడలేదు. దీంతో నష్టం కలిగించిన వ్యక్తిని పట్టుకోలేకపోయారు. ప్రభుత్వ స్థలాలలో దుకాణాలు నడుపుతున్నందుకు మేము క్రమం తప్పకుండా అద్దెలు చెల్లిస్తున్నాము. కనీసం ఆ డబ్బుతోనైనా మాకు కనీస భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులకు లేదా? అని వ్యాపారులు ప్రశ్నించారు. లైట్లు, సీసీ కెమెరాలు వంటి మౌలిక వసతులు లేకపోవడం వలన తరచుగా రాత్రి సమయాలలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని వారు వాపోయారు. వినాయకపురం సెంటర్ రద్దీగా ఉండే ప్రాంతమని, రాత్రిపూట భద్రత కల్పించడం అత్యవసరం అని వ్యాపారులు కోరారు. దుకాణాలకు రక్షణ కల్పించే విధంగా తక్షణమే సెంటర్‌లో అధిక వెలుతురునిచ్చే వీధి దీపాలను మరియు సమర్థవంతంగా పనిచేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వారు సంబంధిత అధికారులను, స్థానిక సంస్థల నాయకులను డిమాండ్ చేశారు.









