శభాష్ సతీష్….పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను అప్పగించాడు
పినపాక: ఓ వ్యక్తి తన సెల్ ఫోను ను పోగొట్టుకోగా సెల్ దొరికిన వ్యక్తి తిరిగి అప్పగించిన సంఘటన పినపాక మండల కేంద్రంలో చోటు చేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి. పినపాక మండల కేంద్రం లో ఆర్ఎంపి వైద్యుని కుమారుని వివాహ కార్యక్రమానికి బంధువులు హాజరయ్యారు. ఈ క్రమంలో పెళ్లి కొడుకును ఊరేగింపుగా తీసుకెళ్తున్న సందర్భంలో ఓ మహిళ తన కుమారుడికి సెల్ ఫోన్ ఇవ్వడం జరిగింది. అనుకోకుండా ఆ బాలుడి చేతిలో ఉన్న సెల్ ఫోన్ కిందపడి పోవడం జరిగింది. ఈ సమయంలోనే పినపాక లో పలు షాపులకు కోడిగుడ్లు వేసి అటునుండి వస్తున్న ఏడుల్లా బయ్యారం క్రాస్ రోడ్డుకు చెందిన కోడిగుడ్ల వ్యాపారి సతీష్ కు సెల్ ఫోన్ దొరికింది. ఈ స్థానంలో మరో వ్యక్తి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించలేము.కానీ మానవత్వంతో ఆలోచించిన సతీష్ … బాధిత వ్యక్తులు కాల్ చేయగానే వెంటనే స్పందించి తను ఉన్న చోటు తెలియజేశాడు. పినపాక దామోదర్ ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్ కి సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధిత వ్యక్తులు రాగా వారికి సతీష్ సెల్ ఫోన్ అప్పగించాడు. ఈ సందర్భంగా సతీష్ కి బాధిత వ్యక్తులు కృతజ్ఞతలు తెలిపారు.
రోడ్డుమీద ఒక్క రూపాయి దొరికితేనే జేబులో వేసుకునే నేటి రోజులలో… మానవత్వంతో దొరికిన సెల్ ఫోన్ ని అప్పగించిన కోడిగుడ్ల వ్యాపారి సతీష్ ని పలువురు అభినందించారు.









