తక్కువ లోతులో స్తంభాల దిమ్మెలు నిర్మాణంపై బీజేపీ నాయకుల ఆరోపణలు; కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, అక్టోబర్, 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట టౌన్ పరిధిలోని జయలక్ష్మి సినిమా హాల్ దగ్గర ఇటీవల ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ స్తంభం నాణ్యత లోపాలను బహిర్గతం చేసింది. గుర్తు తెలియని వాహనం తాకిన వెంటనే ఒక సెంట్రల్ లైటింగ్ స్తంభం కింద పడిపోయింది. ఈ ఘటనపై స్థానిక బీజేపీ నాయకులు కింద పడిన స్తంభాన్ని పరిశీలించారు. స్తంభం బేస్ మట్టంతో సహా బయటకు రావడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ఒక వాహనం తాకినంత మాత్రాన స్తంభం కూలిపోవడం బట్టి, దీని నిర్మాణం తక్కువ లోతులో చేపట్టినట్లు స్పష్టమవుతోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. సాధారణంగా ఇలాంటి స్తంభాలకు పునాది కనీసం ఒక మీటరు లోతులో నిర్మించాల్సి ఉంటుంది. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నాసిరకం పనులు చేసి, పైపై పనులతో చేతులు దులుపుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు పేర్కొన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం నాసిరకం పనుల కారణంగా రానున్న రోజుల్లో మిగిలిన స్తంభాలు ఎంతకాలం నిలకడగా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ లైటింగ్ పనుల్లో నాణ్యత లోపాలకు కారణమైన కాంట్రాక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డ సతీష్, కారం రత్నా కుమారి, బెల్లం కృష్ణవేణి, ఆళ్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.









