మహిళల హక్కుల కోసం సంఘటితంగా పోరాడుదాం
ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేద్దాం.
ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ.
నేటి గదర్ న్యూస్, వైరా:
మహిళలపై పెరుగుతున్న వేదింపులు, అత్యాచారాలు, హింసను ప్రతిఘటిద్దామని, మహిళల హక్కుల కోసం సంఘటితంగా పోరాడుదామని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) వైరా డివిజన్ కమిటీ సమావేశం డివిజన్ అధ్యక్షురాలు కొండబోయిన ఉమావతి అధ్యక్షతన స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనం నందు శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బుగ్గవీటి సరళ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చాక మనువాదం పేరుతో సాంప్రదాయం ముసుగులో మహిళలను వంటింటికి పరిమితం చేయాలని, మను ధర్మ శాస్త్రాన్ని ఆచరించాలని చూస్తుందని ఆమె విమర్శించారు. మహిళలు ఇంట, బయట శ్రమ దోపిడి గురవుతున్నారని, మహిళలపై హింస, అత్యాచారాలు పెరిగాయని, మహిళలను రెండవ తరగతి పౌరులుగా చూస్తూ ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలలో అవకాశం కల్పించకుండా మహిళలకు అన్యాయం చేస్తున్నారన్నారు. చట్టసభలలో రిజర్వేషన్ కల్పించకుండా మహిళా సాధికారత సాధ్యం కాదన్నారు. నేటి ఆధునిక యుగంలో మహిళలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న వారిని ప్రోత్సహించడంలో, రక్షణ కల్పించడంలో పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు చట్టం తీసుకురావాలని, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు వేంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలు రాజకీయంగా ఎదిగినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రతిరోజు దేశంలో, రాష్ట్రంలో పసి వయసు నుంచి పండు ముసలి వరకు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు, హింసను అరికట్టాలని, అకృత్యాలకు కారణమైన మద్యాన్ని, అశ్లీల చిత్రాలను, అశ్లీల సాహిత్యాన్ని నివారించాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో హామీలు ఇచ్చి మహిళలను మోసం చేస్తున్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మహిళకు 2500 ప్రతినెలా ఇస్తానని, సామాజిక పెన్షన్లు 2000 నుంచి 4000 పెంచుతామని, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం మహిళలు ఐక్యంగా పోరాడాలని, ప్రజాస్వామ్యం, సమానత్వం, స్ర్తీ విముక్తి కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మెరుగు రమణ, జిల్లా కార్యదర్శి బండి పద్మ, వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, సభ్యులు మచ్చా మణి, తాళ్ళపల్లి విజయ, తోట కృష్ణవేణి, జర్రిపోతుల పుష్పరాజ్యం, సురబాక ధనమ్మ, కంసాని మల్లికాంబ, కేశగాని నీలిమ, కట్టా విజయ, పెద్దిమల్ల పద్మతిలకం, గొల్లమల సరోజిని, ఏర్పుల మణి తదితరులు పాల్గొన్నారు.









