అశ్వారావుపేట డ్రగ్స్‌పై యుద్ధంలో భాగంగా “కార్డెన్ అండ్ సెర్చ్”; 16 లీటర్ల మద్యం స్వాధీనం
ఎస్పీ ఆదేశాలతో కార్డెన్ అండ్ సెర్చ్; డ్రగ్స్‌పై అవగాహనతో పాటు బెల్టు షాపులపై తనిఖీ.
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు “చైతన్యం – డ్రగ్స్ పై యుద్ధం” కార్యక్రమంలో భాగంగా, డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి చైతన్యం కల్పించే ఉద్దేశంతో అశ్వారావుపేట పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. శనివారం అశ్వారావుపేట మున్సిపాలిటీలోని వడ్డెర బజార్ కాలనీ వద్ద నాకాబంది మరియు కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో సుమారు 70 మోటార్ సైకిళ్లు, 4 ఆటోలు, 4 కార్లు, ఆరు ట్రాక్టర్లు, రెండు లారీలు మరియు బెల్టు షాపులను సోదా చేశారు. ఈ సోదాల సందర్భంగా సుమారు 16 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో వడ్డెర బజార్ కాలనీ నివాసులందరికీ డ్రగ్స్ వలన కలిగే అనర్ధాల గురించి వివరించి, వాటిపై చైతన్యం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట సీఐ పి నాగరాజు మరియు అశ్వారావుపేట, దమ్మపేట ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.









