ధర్మం ముసుగులో దాడి చేస్తే కేసులు ఉండవా ?
రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళు దేశ ద్రోహులు.
CJI మీద బూటుతో దాడి చేస్తే చట్టపరమైన చర్యలు ఎందుకు లేవు కత్తితో దాడి చేసినా ఇంతేనా పరిస్థితి ?
మమ్మల్ని అంటరానివారిగా చేసింది ఏ ధర్మమో జవాబు కావాలి.
CJIపై దాడికి నిరసనగా నవంబర్ 17 న ఛలో ఢిల్లీ.
– ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు “పద్మశ్రీ” మంద కృష్ణ మాదిగ.
నేటి గదర్ హైదరాబాద్ న్యూస్ నవంబర్ 3.
సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ BR గవాయి గారిపై అమానుష దాడి జరిగిన నేపథ్యంలో దేశ భక్తులు ఎవరో ,దేశ ద్రోహులు ఎవరో విస్తృతంగా చర్చ జరగాలని, భారతదేశంలో ఉంటూ భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న వారు ,రాజ్యాంగాన్ని దిక్కరిస్తున్న వాళ్ళు దేశద్రోహులు అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ” పద్మశ్రీ” మంద కృష్ణ మాదిగ గారు ద్వజమెత్తారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంద కృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ ” రాజ్యాంగ వ్యవస్థలో అత్తున్నతమైనదిగా ఉన్న సుప్రీం కోర్టులో చీఫ్ జస్టీస్ దళితుడైన BR గవాయ్ మీద అమానుషమైన దాడి జరిగి నెల రోజులు కావస్తున్నా నేటికీ చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమని అన్నారు.
దేశ ప్రజలంతా ఈ దారుణాన్ని ఖండించినా కూడా చట్టపరమైన వ్యవస్థలు మాత్రం కనీసం సుమోటోగా కేసు స్వీకరించకుండా దళితులను చిన్నచూపు చూసాయని అన్నారు.
నిందితుడు బూట్లతో దాడి చేస్తే మౌనంగా ఉన్న వ్యవస్థలు రేపు కత్తులతో దాడులు చేసినా ఇలాగే వ్యవహరిస్తాయా అని ప్రశ్నించారు.
డిల్లీ పోలీసులు, న్యాయవ్యవస్థ, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ దాడిని సుమోటోగా ఎందుకు స్వీకరించలేదు అని ప్రశ్నించారు.
ఎన్నో సంఘటనలను పత్రికలో వచ్చిన వార్తలను ఆధారం చేసుకొని సుమోటోగా స్వీకరిస్తున్న వ్యవస్థలకు న్యాయవ్యవస్థకే సుప్రీంగా ఉన్న సుప్రీం కోర్టులో ఏకంగా చీఫ్ జస్టీస్ పైన దాడి జరిగితే మౌనంగా ఉండడం వెనుక మర్మం ఏమిటి అని అన్నారు.
ఈ దాడిని ధర్మం కోసం చేశానని నిందితుడు బహిరంగంగా చెబుతుంటే, చేసిన దాడిని కొంతమంది సమర్థిస్తూ ఇంకా దాడులు చేస్తామని మాట్లాడుతుంటే ఈ దేశ వ్యవస్థల మౌనం వహించడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు .
ధర్మం ముసుగులో దాడులు చేస్తే చట్టపరమైన చర్యలు ఉండవా ? కేసులు పెట్టడం జరగదా ? అరెస్టులు ఉండవా ? శిక్షలు వేయరా ? అని ప్రశ్నించారు.
విశ్వాసాలు, ధర్మాలు రాజ్యాంగానికి , చట్టానికి లోబడి ఉండాల్సిందేనని అన్నారు.
గవాయి మీద జరిగిన దాడి దళితులపైన, రాజ్యాంగపైన దాడిగా ఉందని అన్నారు.
రాజ్యాంగం అంటే గిట్టని శక్తులే లాగే దళితులంటే చిన్నచూపు చూసే వాళ్ళే ఈ దాడికి తెగబడుతున్నాయని అన్నారు.
దాడి చేసిన వాళ్ళు చెప్తున్న ధర్మాలు ఉత్తమమైనవే అయితే ఈ దేశంలో దళితులు అంటరానివారిగా ఎందుకయ్యారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఆ ధర్మాలు మంచివే అయితే దళితులు పశువుల కన్నా హీనంగా ఎందుకు చూడబడ్డారో జవాబు కావాలని అన్నారు .
రాజ్యాంగం ఏర్పడిన తర్వాతనే దళితులు మనుషులుగా గుర్తింపు పొందారని అన్నారు.
రాజ్యాంగం వల్లనే దళితులు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు.
కనుక దళితుల మీద దాడి చేయడం ద్వారా రాజ్యాంగంపై దాడి చేయాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు.
ధర్మాల పేరుతో దాడులు చేస్తామంటే , రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తామంటే సహించబోమని అన్నారు.
రాజ్యాంగాన్ని ధిక్కరించేవాళ్లు , చట్టాలను విధ్వంసం చేసేవాళ్లు దేశద్రోహులుగా మిగిలిపోతారు అన్నారు.
ఇప్పుడు దేశంలో దేశభక్తులు ఎవరో , దేశద్రోహులు ఎవరో చర్చ విస్తృతంగా జరగాలని అన్నారు.
దేశభక్తులు ,దేశ ద్రోహులు అనే వాటికి నిర్దిష్టమైన నిర్వచనం రావాలని అన్నారు.
భారతదేశంలో ఉంటూ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండేవాళ్లు, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళే దేశభక్తులు అవుతారని అన్నారు.
భారతదేశంలో ఉంటూనే భారత రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళు, రాజ్యాంగాన్ని అవహేళన చేసేవాళ్లు దేశద్రోహులవుతారని అన్నారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రపంచమంతా కీర్తించి ఆయన జన్మదినాన్ని ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటిస్తే , అంత గొప్ప రాజ్యాంగం మీద దేశంలోని కొంతమంది మూర్ఖులు దాడులు చేస్తుండడం దుర్మార్గమని అన్నారు.ఉన్నత న్యాయవ్యవస్థలో కూడా దళితులకు అడుగడుగున అవమానాలు జరుగుతున్నాయని అన్నారు.ఉన్నత వర్గాల చెందిన వారైతే ఒక విధంగా దళిత వర్గాల చెందిన వాళ్లయితే మరొక విధంగా వ్యవహరిస్తూ వివక్షతను పాటించడం న్యాయవ్యవస్థలోని కొన్ని శక్తులకు అలవాటైందనన్నారు.ఉన్నత వర్గాల జడ్జీలు ఏవైనా లోపాలను లేవనెత్తితే వాటిని న్యాయసమీక్ష కోణంలో చూస్తున్నారని దళిత వర్గాల చెందిన జడ్జీలు లోపాలను లేవనెత్తితే న్యాయవ్యవస్థ ధిక్కారం కింద కేసులు పెట్టి శిక్షించిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. అందుకు హైకోర్టు జస్టిస్ కర్ణన్ గారికి వేసిన శిక్ష సాక్ష్యం అని అన్నారు.దళితులపై జరుగుతున్న వివక్షతను, అణచివేతను దళిత సమాజం గట్టిగా ఎదుర్కోవడానికి సిద్దమవుతుందని అన్నారు.
అందులో భాగంగా జస్టిస్ బిఆర్ గవాయి గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ , కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ నవంబర్ 17 న ఛలో డిల్లీకి పిలుపునిస్తున్నామని , దేశ రాజధానిలో లక్షలాదిమందితో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ చేపడుతామని అన్నారు.
దళితుల ఆత్మగౌరవం కోసం , న్యాయవ్యవస్థ గౌరవం కోసం , రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం దేశ వ్యాప్తంగా దళిత, అణగారిన వర్గాల ప్రజలు మరియు ప్రజాస్వామికవాదులు డిల్లీకి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు .మొన్న హైదరాబాదులో నిర్వహించిన దళితుల ఆత్మగౌరవ ర్యాలీ పెద్ద ఎత్తున విజయవంతమైందని కానీ కొన్ని పత్రికలు కొన్ని న్యూస్ చానల్స్ ఆ ర్యాలీ వార్తలను తొక్కిపట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేయడం జరిగిందని అన్నారు.గవాయి గారిపై జరిగిన దాడిని నిరసిస్తూ దళిత సమాజం రోడ్ల మీదికి వచ్చి పోరాటం చేస్తుంటే ఆ పోరాటానికి సంబంధించిన వార్తలు ప్రచురించకుండా, బాధితుల వైపు కాకుండా నిందితుల వైపు ఉండడానికి కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుందని , ఇది సరైనది కాదని, దీనిని దళిత సమాజం గమనిస్తుందని అన్నారు.









