కార్తీక వన సమారాధన: నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో దమ్మపేటలో అంబరాన్ని తాకిన సంబరం
గోపాలపురం శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద వైభవంగా వేడుకలు; వేల సంఖ్యలో పాల్గొన్న నాయకపోడు సోదర, సోదరీమణులు
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, నవంబర్, 16: అశ్వారావుపేట నియోజకవర్గ నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాడు కార్తీక వన సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో జరిగింది. దమ్మపేట మండలంలోని గోపాలపురం గ్రామం శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద నిర్వహించిన ఈ వేడుకకు నియోజకవర్గ పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది నాయకపోడు సంఘ సభ్యులు సకుటుంబ సపరివార సమేతంగా హాజరయ్యారు. అధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం 8:00 గంటలకు పవిత్రమైన ఉసిరిచెట్టు పూజా కార్యక్రమముతో వన సమారాధన ప్రారంభమైంది. భక్తులు పట్టు వస్త్రాలు, పండ్లతో ఉసిరి వృక్షానికి పూజలు నిర్వహించారు. ఉదయం 8:30 గంటలకు భక్తులకు అల్పాహారం అందించారు. అనంతరం, ఉదయం 10:30 గంటలకు నాయకపోడు సేవా సంఘం పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఉండి, సంఘ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వన భోజన విరామము జరిగింది. వేలాది మంది భక్తులు ఒకే చోట భక్తి శ్రద్ధలతో భోజనం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన కళాకారులు: మధ్యాహ్నం 2:30 గంటలకు మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. స్థానిక కళాకారులు నాయకపోడు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్యాలు, జానపద గీతాలను ప్రదర్శించారు. సాయంత్రం 4:30 నిమిషాలకు ముగింపు కార్యక్రమంతో వన సమారాధన విజయవంతంగా పూర్తయింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అశ్వారావుపేట నియోజకవర్గ నాయకపోడు సేవా సంఘం – ఆహ్వాన కమిటీ తరపున నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.









