క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
కిన్నెరసాని క్రీడా పాఠశాలలో ఐటీడీఏ జోనల్ పోటీలు ప్రారంభం; గిరిజన విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తామన్న ఎమ్మెల్యే జారే
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 18: ఉమ్మడి ఖమ్మం ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జోనల్ స్థాయి క్రీడా పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర క్రీడా పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి ఆయన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ, గిరిజన పిల్లలు ఎంతో ప్రతిభావంతులని, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా ముందుకు వెళ్లగలరని అన్నారు. ఈ క్రీడా పోటీలు మీ ప్రతిభను చూపించి మంచి అవకాశాలు కల్పించుకోవడానికి వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో క్రీడలు అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తోందని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, క్రీడా సామగ్రి, శిక్షణ వంటి విషయాలపై మరింత దృష్టి పెట్టనున్నామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి వాలీబాల్, ఆర్చరీ ఆటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహూల్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, క్రీడా అధికారులు, పాఠశాల అధ్యాపకులు, ఐటీడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









