పేదల ఇళ్ల కూల్చివేతపై రాజకీయ పోరాటం: సీపీఐ దీక్షకు మద్దతు -తహసీల్దార్‌పై మాజీ ఎమ్మెల్యే తాటి ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యంపై వెంకటేశ్వర్లు ఆగ్రహం; ఎమ్మార్వో తడబాటుతో సమాధానం
నేటి గద్దర్ న్యూస్, అశ్వరావుపేట, (రిపోర్టర్: దాది చంటి), నవంబర్ 19: అశ్వరావుపేటలో నిరుపేదల గృహాల తొలగింపు వ్యవహారంపై రాజకీయ వేడి రాజుకుంది. సుమారు రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిలో నిర్మించిన 150కి పైగా తాత్కాలిక గృహాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ సీపీఐ పార్టీ తహసిల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన నిరసన దీక్షకు అశ్వరావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సంఘీభావం ప్రకటించారు. దీక్షా శిబిరం వద్ద మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేద ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యంతో నష్టపోయిన పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు సీపీఐ పార్టీతో కలిసి పోరాటం చేస్తామని ఆయన తెలియజేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సంఘీభావం తెలిపిన వెంటనే, భూ ఆక్రమణ బాధితుల సమస్యపై మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అశ్వరావుపేట తాహసీల్దార్ కు నేరుగా ఫోన్ చేశారు. పేదల సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ఆయన తహసీల్దార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రశ్నలకు తాహసీల్దార్ తడబడుతూ సమాధానం చెప్పిన ఈ ఘటన అక్కడ చర్చనీయాంశంగా మారింది. తహసీల్దార్‌తో మాజీ ఎమ్మెల్యే మాట్లాడిన తీరును బట్టి, పేదల పక్షాన సమస్యను పరిష్కరించడానికి తాటి వెంకటేశ్వర్లు ఎంతటి దృఢ నిశ్చయంతో ఉన్నారో స్పష్టమైంది.









