ప్రజల ప్రాణాలను కాపాడండి: రోడ్ల గుంతలపై బీఆర్‌ఎస్ ఆందోళన
అశ్వారావుపేటలో ఎంపీడీవోకు వినతిపత్రం; పేదల గూడు కూల్చడంపై సీపీఐ నిరసనకు మద్దతు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) నవంబర్ 19: రాష్ట్రంలో రోడ్ల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శించింది. ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే గుంతలను పూడ్చాలని బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జుజ్జూరి వెంకన్న బాబు డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపుమేరకు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అశ్వారావుపేటలో నిరసన కార్యక్రమం జరిగింది. స్థానిక రింగ్ రోడ్డు సెంటర్ నుండి బైక్ ర్యాలీగా బయలుదేరిన బీఆర్‌ఎస్ నాయకులు ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గుంతలు పూడ్చాలని కోరుతూ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి బుధవారం నాడు అందజేశారు. మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు జుజ్జూరి వెంకన్న బాబు మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా ఉన్న అనేక రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారాయని, తక్షణమే గుంతలను పూడ్చకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. “గుంతలను పూడ్చండి, ప్రజల ప్రాణాల్ని కాపాడండి” అంటూ నినాదాలు చేశారు. సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు నారం రాజశేఖర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలను, రహదారులను గాలికి వదిలేసిందని విమర్శించారు. అదేవిధంగా ఇటీవలే అశ్వారావుపేట లో పేదల ఇళ్లను చెప్పా పెట్టకుండా కూల్చడం అన్యాయమని, తక్షణమే వారిని ఆదుకోవాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. అశ్వారావుపేట మండలంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు పేదల ఇళ్లను కూల్చిన విషయంపై సీపీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనకు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జుజ్జూరి వెంకన్న బాబు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పక్షాన మద్దతు ప్రకటించారు. తక్షణమే పేదలను ఆదుకోవాలని సీపీఐ చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు అందిస్తున్నామని వెంకన్న బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో జె శ్రీరామ్మూర్తి, రఘురాం, ఎస్ వీర్రాజు, ఎన్ వెంకన్న బాబు, ఎండి హుస్సేన్, ఎం నవీన్ నాయక్, హెచ్ వంశీ నాయక్, తల్లాడి వెంకటేశ్వరరావు, గోవింద్, తాళం సూరిబాబు, ఎన్ రాంబాబు, సిహెచ్ బజారయ్య, పద్దం జోగారావు, కృష్ణ, కాశి కాళహస్తి, తూంపాటి రమేష్, కే చిరంజీవి, సూరిబాబు, జి నవీన్ బాబు, చరణ్, వెంకటస్వామి, కాటూరి నాగేంద్ర, అమీర్, రహమత్, పానుగంటి లక్ష్మణరావు, మొడియం జగన్నాథం, ఉప్పల రత్నాకర్, తల్లాడి వెంకటేశ్వరరావు, రాము, వీరబాబు, అంకిరాజు, నక్క రాంబాబు, రాంబాబు, ధర్మ, సురేష్, తదితర బీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.









