నిమ్స్‌లో అశ్వారావుపేట రోగుల పరామర్శ -మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే జారె ఆదేశం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్ట్రర్: దాది చంటి) నవంబర్, 21: అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి వచ్చిన అనారోగ్య బాధితులకు ప్రత్యేక శ్రద్ధతో మెరుగైన వైద్యం అందించాలని అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆసుపత్రి వైద్యులకు సూచించారు. నవంబర్ 21, శుక్రవారం నాడు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నిమ్స్‌ను సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన ప్రతి ఒక్క రోగిని ఆయన వ్యక్తిగతంగా పరామర్శించి, వారికి ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా, రోగుల ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న చికిత్స గురించి ఆయన వైద్యులతో మాట్లాడి, అశ్వారావుపేట నుంచి వచ్చిన బాధితులకు మంచి చికిత్స అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్లను కోరారు. అదే విధంగా, సర్జరీలు అవసరమైన రోగులందరికీ ప్రభుత్వం తరఫున ఎల్‌ఓసీ జారీ చేయించి, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటామని, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పష్టం చేశారు.









