కారు గుర్తుకే ఓటు వేయండి -కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టిన మాజీ ఎమ్మెల్యే, మెచ్చా నాగేశ్వరరావు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 4: అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల వేళ రాజకీయ సందడి నెలకొంది, ఇందులో భాగంగా 15వ వార్డులో తెలుగుదేశం పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరేపల్లి వెంకట నాగ సౌజన్య విజయాన్ని కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు బుధవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లతో ముఖాముఖి మాట్లాడుతూ, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను నిలువునా మోసం చేస్తోందని విమర్శించారు. కేవలం బిఆర్ఎస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేస్తూ, వార్డు పురోభివృద్ధి కోసం కారు గుర్తుపై ఓటు వేసి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల స్థాయి ముఖ్య నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పాల్గొని అభ్యర్థికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.









