అశ్వారావుపేటలో ‘మద్యం’ మాఫియా మాయాజాలం: సిండికేట్ సెగలతో సామాన్యుడి జేబుకు చిల్లు!
ఎ!క్సైజ్ శాఖ కళ్లున్నా కబోదిలా? పల్లెపల్లెనా బెల్టు షాపుల రాజ్యపాలన.. కలెక్టర్ గారూ.. ఇటు చూడండి!
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 04: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో మద్యం వ్యాపారం ఒక మాఫియాలా మారుతోంది. కొత్త టెండర్లు దక్కించుకున్న నాటి నుండి సాఫీగా సాగిన వ్యాపారం, ఇప్పుడు ‘ఆధిపత్య పోరు’తో రణరంగంగా మారింది. భాగస్వాముల మధ్య సయోధ్య కుదరకపోవడం, ‘మేమే నడుపుతాం’ అంటూ అంగబలంతో కొందరు భీష్మించుకోవడంతో సిండికేట్ రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి. లక్షల రూపాయలు డీడీలు కట్టి షాపులు దక్కించుకున్న చిన్న వ్యాపారులు, పెద్దల దెబ్బకు పెట్టుబడి కూడా రాదేమోనని లబోదిబోమంటున్నారు. మరోవైపు, పల్లెల్లో బెల్టు షాపుల దందా యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనల ప్రకారం వైన్ షాపుల్లోనే మద్యం విక్రయించాల్సి ఉండగా, నిర్వాహకులు ప్రతి గ్రామంలోనూ బెల్టు కేంద్రాలను ఏర్పాటు చేసి క్వార్టరుకు రూ. 20 నుండి రూ. 50 వరకు అదనంగా వసూలు చేస్తూ సామాన్యులను నిలువు దోపిడీ చేస్తున్నారు. విద్యుత్ వెలుగులు, సిట్టింగ్ సౌకర్యాలతో క్లబ్బులను తలపించేలా బెల్టు షాపులు నడుస్తున్నా, అశ్వారావుపేట ఎక్సైజ్ అధికారులు మాత్రం “మాకు బెల్టు షాపులే కనిపించడం లేదు” అనడం వారి అవినీతికి పరాకాష్టగా కనిపిస్తోంది. ముడుపుల మత్తులో జోగుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో పెరుగుతున్న క్రైమ్ రేటును విస్మరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి, అక్రమ బెల్టు షాపులను అరికట్టాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.









