వైరా మున్సిపాలిటీలో కదం తొక్కిన గులాబీ దళం…
నామ–పువ్వాడ–తాత మధు రోడ్ షో కు భారీ స్పందన
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం అభ్యర్థులు విజయాన్ని కాంక్షిస్తూ గురువారం బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, వైరా మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఆధ్వర్యంలో జరిగిన రోడ్ షో కు భారీ స్పందన లభించింది. అధిక సంఖ్య లో నాయకులు, కార్యకర్తలు పాల్గొని రోడ్ షో ను విజయవంతం చేసారు. ఈ సందర్భంగా ముందుగా వైరా ఎస్టీ కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అనంతరం పట్టణంలోని వివిధ వార్డుల్లో పర్యటించి ప్రజలతో మమేకమై ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థి కట్టా స్వరూప రాణి, బీఆర్ఎస్ మూడవ వార్డ్ అభ్యర్థి కారుకొండ బోసు, తొమ్మిదవ వార్డ్ సీపీఎం అభ్యర్థి గుడిమెట్ల రజితలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయా వార్డుల్లో బీఆర్ఎస్, సీపీఎం నాయకులు, కార్యకర్తలతో కలిసి రోడ్ షో నిర్వహించి ఇంటింటా ప్రచారం చేపట్టారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ “కాంగ్రెస్ బాకీ కార్డు”లను ఇంటింటికి పంపిణీ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా వారు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేస్తూ మరోసారి బీఆర్ఎస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు.









