గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్ల పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.150కోట్ల 57 లక్షల 59వేల 500 నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 32 జిల్లాల్లో పనిచేస్తున్న 29,676 మందికి దాదాపు ఆరు నుంచి ఏడు నెలలుగా జీతాలు అందడంలేదు. తాజాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అందరికీ ప్రయోజనం చేకూరనుంది.
ఈ నెల 12న బడ్జెట్ విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నిధులు విడుదల చేస్తూ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను మల్టీపర్పస్ కార్మికుల వేతనాలకు ఖర్చు చేయాలని తెలిపారు. ఈ మేరకు గ్రామ పంచాయతీలకు రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ కింద జిల్లాలకు ఈ మొత్తాన్ని మంజూరు చేశారు. జిల్లాల వారీగా కార్మికుల సంఖ్య, వారికి చెల్లించాల్సిన మొత్తంను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ సిబ్బంది పెండింగ్ వేతనాలు చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. పలు పోరాటాల తర్వాతే ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసిందంటూ..గతంలో చేసిన ఆందోళనలను చేశామని యూనియన్ నాయకులు తెలిపారు. వేతనాల సమస్యను పరిష్కరించినందుకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉండగా, ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు పలు ముఖ్యమైన అంశాలపై అధికారులు వ్యవహరించాల్సిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం 9.30 గంటలకు సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం కానున్నారు. ఈ సమీక్షలో మంత్రులు, సీఎస్, డీజీపీ, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారు.
ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం, సీజన్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, ఇతర భద్రతాపరమైన అంశాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం వంటి 9 అంశాలను ఎజెండాలో చేర్చారు. వీటిని ఇప్పటికే సంబంధిత శాఖలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశాయి. వీటిపై అంశాల వారీగా సీఎం చర్చించి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.