నేటి గదర్ న్యూస్,ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ అవుతోంది. ఈ పథకం కింద, చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.13,000 చొప్పున ఆర్థిక సహాయం అందుతుండటంతో అనేక కుటుంబాలు, ముఖ్యంగా ఎక్కువ మంది పిల్లలున్నవారు గణనీయంగా లబ్ధి పొందుతున్నారు.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాల ఆనందం గురించి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ‘ఎక్స్’ సామాజిక మాధ్యమ వేదికగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. అన్నమయ్య జిల్లా కలకడ మండలంలోని ఒక ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు తల్లులకు, వారి 12 మంది పిల్లల చదువుల నిమిత్తం ‘తల్లికి వందనం’ కింద ఏకంగా రూ.1.56 లక్షలు జమ అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు తమ ఖాతాల్లో జమ కావడంతో ఆ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆ తల్లులు అపరిమితమైన సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ తల్లులు కృతజ్ఞతలు తెలియజేశారు.
కాగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరెవరికి ఎంత డబ్బులు పడ్డాయో తెలుసుకోవాలి అంటే 13 ఎక్కం రావాల్సిందేనని సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. దీనితో 13వ ఎక్కం ప్రస్తుతం వైరల్ అవుతుంది.









